హైదరాబాద్/ అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి మెరుపు దాడులు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో హైదరాబాద్, విజయవాడ సహా ఇరు రాష్ట్రాల్లోని మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని పూణే సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత ఇన్వెస్టిమెంట్ యాప్ల ద్వారా సామాన్యులను ఆకర్షించి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర ముఠాలను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
గత వారం ఉత్తరాదిలోని ఢిల్లీ, ముంబై, గుర్గావ్ నగరాల్లో ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సోదాల్లో లభించిన కీలక సమాచారం, లింకుల ఆధారంగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. నిందితులు బెట్టింగ్ ద్వారా సేకరించిన సొమ్మును షెల్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీల మార్గం ద్వారా విదేశాలకు అక్రమంగా తరలించినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించింది.
ప్రస్తుతం కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ పరికరాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఆధారాలు, హవాలా నెట్వర్క్ నెరిపిన పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. నిందితుల అక్రమ లావాదేవీల తీగ లాగితే మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.