Date : 24 October 2026
Posted By : RVI

కేసీఆర్ మిషన్ ఢిల్లీ - థర్డ్ ఫ్రంట్ దిశగా కదలికలు - కేటీఆర్ హింట్ ఇచ్చేశారా?

కేసీఆర్ మిషన్ ఢిల్లీ - థర్డ్ ఫ్రంట్ దిశగా కదలికలు - కేటీఆర్ హింట్ ఇచ్చేశారా?

భారత రాష్ట్ర సమితి  అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు త్వరలోనే జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారి, ఢిల్లీ పీఠాన్ని శాసించే స్థాయిలో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట్ నియోజకవర్గ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బలహీనపడుతోందని, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ వైఫల్యాల వల్ల దేశంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర శక్తుల   అవసరం త్వరలోనే పరాకాష్టకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం తెలంగాణ రాష్ట్రాానికే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో కేసీఆర్ మళ్లీ కీలకపాత్ర పోషిస్తారని స్పష్టం చేయడం గులాబీ శ్రేణుల్లో నయా ఉత్సాహాన్ని నింపింది.

 కేసీఆర్ అసలు వ్యూహం ఏమిటి? 

కేటీఆర్ వ్యాఖ్యల కోసం థర్డ్ ఫ్రంట్ కోసం తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది.  2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం, మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా  కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడుతుండటం వంటి పరిణామాలను బీఆర్ఎస్ నిశితంగా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వం వైఫల్యం చెందిందని భావిస్తున్న అనేక ప్రాంతీయ పార్టీలకు బలమైన, అనుభవజ్ఞుడైన ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరంగా మారింది. ఈ ఖాళీని భర్తీ చేయడానికే కేసీఆర్ జాతీయ వేదికపై నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ ఫ్రంట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చే వ్యూహంతో ఉన్నారని తెలుస్తోంది.

కేసీఆర్ ఇమేజ్ నేషనల్ వైడ్ అని చెప్పే ఉ్దదేశం

  కేటీఆర్ చేసిన ఈ  నేషనల్ పొలిటికల్స్ వ్యాఖ్యలు కేవలం జాతీయ స్థాయి కోసమే కాకుండా, తెలంగాణ స్థానిక రాజకీయాలకు కూడా ముడిపడి ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి, అనంతరం పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ కేడర్‌ను తిరిగి సమీకరించడానికి ఇది ఒక బలమైన ఆత్మవిశ్వాస అస్త్రంగా ఉపయోగపడుతుంది. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల సమరంలో శ్రేణులను క్రియాశీలంగా ఉంచేందుకు కేసీఆర్ జాతీయ రీ-ఎంట్రీ,  మళ్లీ కేసీఆరే సీఎం అవుతారు అనే ప్రచారాన్ని బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వాడుకుంటోంది.

కొన్ని పార్టీలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారా? 

 ఢిల్లీ పీఠాన్ని ప్రభావితం చేసే సత్తా ఉన్న తతంగం కోసం కేసీఆర్ ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, బిజూ జనతాదళ్ , వైఎస్ఆర్‌సీపీ వంటి ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతో కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, నిధుల పంపిణీలో రాష్ట్రాలపై జరుగుతున్న వివక్షను ప్రధాన అస్త్రంగా చేసుకుని, ప్రాంతీయ ఆత్మగౌరవ నినాదంతో ప్రాంతీయ పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు  తెరవెనుక నెట్‌వర్కింగ్  వేగవంతమైందనే అభిప్రాయాలు ఉన్నాయి.  

తేలికగా తీసుకుంటున్న కాంగ్రెస్ నేతలు

 తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి, అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ నేతలు ప్రజల దృష్టిని మరల్చడానికే జాతీయ రాజకీయాలంటూ కొత్త నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బిఆర్ఎస్ ఉనికికే ముప్పు ఏర్పడిన తరుణంలో జాతీయ స్థాయిలో మూడో కూటమిని నిర్మించడం సాధ్యపడదని, గతంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినా దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారని ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు.   కేసీఆర్ జాతీయ రీ-ఎంట్రీ ప్రకటన వెనుక అటు జాతీయ స్థాయిలో మారిన రాజకీయ సమీకరణాలను పసిగట్టడమే కాకుండా, ఇటు తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ద్విముఖ వ్యూహం ఉంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ నేరుగా ఢిల్లీ పర్యటనలు చేపట్టి ఇతర ప్రాంతీయ నేతలతో సమావేశమవుతారా లేక కేవలం తెలంగాణ సభలకే పరిమితమవుతారా అనేది తేలితేనే ఈ  థర్డ్ ఫ్రంట్  వ్యూహం ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో స్పష్టత రానుంది.