Date : 24 October 2026
Posted By : RVI

షర్మిల తీరు బాధించింది, నా కూతుళ్ల విషయంలోనూ అదేమాట: సోదరికి జగన్ లేఖ

షర్మిల తీరు బాధించింది, నా కూతుళ్ల విషయంలోనూ అదేమాట: సోదరికి జగన్ లేఖ

వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదం, మేనకోడలు వివాహం వేళ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలకు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. షర్మిల కుమార్తె అంజలి వివాహ వార్తపై హర్షం వ్యక్తం చేస్తూ ఆశీస్సులు అందించిన జగన్, బెంగళూరు నివాసంలో ఆ వివాహ ఏర్పాట్లు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కుమార్తెల వివాహాన్ని సైతం ఈ నివాసంలో జరిపించే సాహసం చేయనని స్పష్టం చేశారు. తాను విషయం చెప్పినా, ఈ విషయంలో షర్మిల ముందుకు వెళ్లడం తనను బాధించిందన్నారు.

ప్రియమైన షర్మీ

అంజిలి పెళ్లి గురించి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, ఆమె జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే, నా అభ్యంతరాలను పట్టించుకోకుండా, బెంగళూరులోని నా నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని నువ్వు ఇప్పటికీ భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలియజేశాను.

పెళ్లి వంటి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంగణంలోకి వస్తారనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకో. వివిధ రకాల సేవలు అందించేవారు, క్యాటరింగ్ సిబ్బంది, పూల అలంకరణలు చేసే బృందాలు, డెకరేషన్ సిబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది ఆ ప్రాంగణంలోకి వస్తారు.
వీరిలో చాలామంది మనకు కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులే. ఇంతమంది వ్యక్తులు ఆ ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం, నివాస ప్రాంగణానికి, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వెళ్లి ప్రచారంలోకి రావడం తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుంది. దయచేసి ఒక విషయం తెలుసుకో. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాలేదు. అంజిలీ చిన్నప్పటి నుంచి పెరుగుతూ రావడాన్ని నేను చూశాను. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. కానీ, నా భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేను.


నా కూతుళ్ల విషయంలోనూ ఇలాగే ఉంటాను

హర్ష లేదా వర్ష పెళ్లి అయినా కూడా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని. ప్రస్తుతం నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఈ నివాసంపై పడుతుంది. దానితోపాటు భద్రతాపరమైన ఆందోళనలు కూడా తలెత్తుతాయి. చివరకు ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబం సేఫ్‌గా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను. వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు సంబంధించిన ముప్పులను పలువురు వ్యక్తుల ద్వారా నీకు తెలియజేసినప్పటికీ, నా అభ్యంతరాలను, ఆందోళనలను పట్టించుకోకుండా నువ్వు (షర్మిల) ముందుకు వెళ్లడం నన్ను బాధించింది. అందువల్ల ఈ విషయంలో నా పరిస్థితిని, నా అభిప్రాయాన్ని మరోసారి పరిగణనలోకి తీసుకుని, పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాను.

రాజా పెళ్లికి చేసినట్లుగా కన్వెన్షన్ సెంటర్లో గానీ, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ పెళ్లి నిర్వహించడం నీకు ఇష్టం లేకపోతే, హైదరాబాద్ లోని నా లోటస్ పాండ్ ఆస్తిని ఉపయోగించుకోవడానికి కూడా నేను అవకాశం ఇచ్చాను. ఆ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది. అంజిలీ పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని, భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. అయితే, ఈ విషయంలో నువ్వు కూడా నా యోచనను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.

ఇట్లు
వైయస్.జగన్