TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయవద్దంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. వచ్చే నవంబర్ 6వ తేదీన జరగనున్న టిజిపిఎస్‌సి (TGPSC) ఎఈఈ పరీక్షను తక్షణమే వాయిదా వేయాలని ఆయన సీఎంను కోరారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే SSC JE ఎగ్జామ్, రాష్ట్ర స్థాయి TGPSC AEE పరీక్షలు ఒకే రోజున నిర్వహించడం వల్ల వేలాది మంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు విలువైన ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల కేంద్రాల్లో SSC JE పరీక్ష రాసే అభ్యర్థులు అదే రోజు వెంటనే తిరిగొచ్చి AEE పరీక్ష రాయడం ఏవిధంగా సాధ్యమవుతుందని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమైన రెండు ప్రధాన పోటీ పరీక్షల్లో ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిన దుస్థితికి నిరుద్యోగ యువత గురవుతోందని లేఖలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ పరీక్షల తేదీలను మార్చాలని అభ్యర్థులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ TGPSC ఏమాత్రం స్పందించకపోవడం విచారకరం అన్నారు. స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అక్టోబర్ 14నే పరీక్ష తేదీలను పునఃపరిశీలించాలని TGPSC కి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నిరుద్యోగ యువత కోరుతున్నది ఉద్యోగ నియామకాలు ఆపాలని కాదని, కేవలం 2 పోటీ పరీక్షలు రాసేందుకు వీలుగా సమయం కేటాయించి అవకాశం కల్పించాలని మాత్రమేనని స్పష్టం చేశారు.